Wednesday, 18 November 2015
Tuesday, 10 November 2015
పేదోడి నమ్మకం, అసహాయ వ్యవస్థ - దాసరి శ్రీనివాసులు Updated :05-03-2015 00:23:37 |
శివయ్య లాంటి పేదలు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడటానికి, అవసరాలకు ఆదుకోలేని సంక్షేమ పథకాలే ముఖ్య కారణం. శివయ్యకి బ్యాంకు ఇచ్చిన లోన్ని ఆంగ్లంలో వర్ణించాలంటే ‘గుడ్ ఫర్ నథింగ్, అండ్ ఫిట్ ఫర్ నథింగ్’.
‘నే తి బువ్వ తినేవాళ్లు అబద్ధం చెప్పరుగందా బాబుగారూ!’ అంటూ అమాయకంగా నా వైపు చూస్తున్న సుతారి శివయ్యను చూసి నవ్వుకున్నాను.
ఆ ప్రాంతానికి పదవిరీత్యా పెద్ద ఉద్యోగాన్ని వెలగబెడుతున్న నేను కూడా శివయ్యలో ఆశలు రేకెత్తించడానికి చెప్పాలంటే ఒక విధంగా కారకుణ్ణి. నా క్వార్టరు పక్కనే కొద్ది దూరంలో ఒక చిన్న ఇంట్లో శివయ్య కాపురముంటున్నాడు. వృత్తిరీత్యా సుతారి. ఇటుకల బట్టీ నిర్వహణలో కూడా నేర్పరి. ఉన్నంతలో సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నాడు. చదువుకుంటే పెద్ద ఉద్యోగాలు వస్తాయని, పిల్లలు సుఖపడుతారనే ఆశతో తన ఇద్దరు కుమారుల్లో చిన్నవాణ్ణి కష్టపడి బి.ఎ. వరకు చదివించాడు. పెద్దవాడు యుక్తవయసు రాగానే తండ్రికి చేదోడువాదోడుగా సుతారి పనిలో సాయంగా ఉంటున్నాడు.
ఒకరోజు సాయంత్రం క్యాంపు నుంచి తిరిగి వస్తూనే గేటు దగ్గర శివయ్య బి.ఎ. చదివిన కొడుకుని వెంటబెట్టుకొని నా క్వార్టరువైపు రావటంచూసి ‘ఏం శివయ్యా! నాతో పనేమైనా పడిందా!’ అని ఆప్యా యంగా పలకరించాను. చదువుకొని నిరుద్యోగిగా ఉన్న తన కొడుక్కి ప్రభుత్వపరంగా ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని అభ్యర్థించాడు.
చదువుకొన్న నిరుద్యోగయువతకు స్వయం ఉపాధి కల్పించే దిశలో ఎన్నో పథకాలు అమలు జరుగుతున్న రోజుల్లో ఇటుకల బట్టీ పెట్టుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చింది నేనే. ప్రభుత్వోద్యోగం ఇప్పించే ఉద్దేశం లేకనే ఇలా చెబుతున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా నిండు విశ్వాసంతో నా మాట విని బ్యాంకు చుట్టూ విసుగు విరామం లేకుండా తిరుగుతున్న శివయ్యని, అతని కొడుకుని చూస్తుంటే పేదవాళ్ళలో ఈ వ్యవస్థపై ఇంకా నమ్మకం ఉందని అని పించింది. నెలరోజుల తర్వాత శివయ్య కుమారుడు తారసపడి బ్యాంకువాళ్లు పెడుతున్న మెలికల్ని ఏకరువు పెట్టాడు. ఇటుకబట్టీ పెట్టాలంటే సీజన్ కంటే రెండు మూడు నెలల ముందు కూలీల జట్లకు అడ్వాన్సులు ఇవ్వాలి. ఇటుక కాల్చడానికి కావల్సిన బొగ్గు, కట్టెల కొనుగోలుకు ముందుగానే కొంత ఖర్చు చేసిన సామగ్రిని సమకూర్చుకోవాలి. అలాగే ఇటుక బట్టీ పెట్టుకోవడానికి అవసరమైన ఎర్ర మట్టి నేలను లీజుకు తీసుకోవాలి. ఈ ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలంటే.. కొంత అడ్వాన్సుగా లోను మంజూరుచేసే వీలులేదని బ్యాంకర్ వాదన. మరి లబ్ధిదారే తన సొంతవనరులతో ఈ ఏర్పాట్లు చేసుకోవాలంటే గగనమైన పని, స్కీంలన్నీ సిద్ధాంతపరంగా బాగానే ఉంటాయి, కానీ అమలు చేయటంలో ఎదురయ్యే ఇబ్బందులు లబ్ధిదారులకు మాత్రమే ఎరుక.
నా హోదా వుపయోగించి బ్యాంకు మేనజర్ని ఒప్పించగలనన్న ధైర్యంతో వారం రోజుల తర్వాత కలుసుకోమని శివయ్య కుమారుణ్ణి పంపించి వేశాను. తీరా బ్యాంకు వాళ్లతో మాట్లాడిన తర్వాత వాళ్లు ఇచ్చిన వివరణ చూశాక అవాక్కవటం నా వంతు అయింది. ఏతా వాతా వాళ్ళు చెప్పింది, ఏమిటంటే అసలు స్కీమ్ రూపకల్పనలో అడ్వాన్సు ఇచ్చే అంశాన్ని పొందుపరచలేదని, లబ్ధిదారు సొంత వనరులతో సమకూర్చుకొనే సామగ్రికి వాల్యుయేషన్ చేయించి లోను రిలీజు చేయటం వరకే తమ వంతు సహాయం అని ఎంతో నేర్పుగా, ఓర్పుగా బ్యాంకు ఫీల్డు ఆఫీసరు ఇచ్చిన సమాచారం శివయ్య కుటుంబానికి ఎలా తెలియజేయాలో నా ఊహకి అందలేదు. ఈ స్కీము నిబంధనలు రూపొందించడంలో లబ్ధిదారుని ప్రమేయం ఎంతమేరకు అన్న ఆలోచన లేని సంస్థల పనితీరు గూర్చి సిగ్గుపడాల్సింది మేము కాదు. 15 రోజుల తర్వాత నమస్కరిస్తూ ఎదురుపడ్డ శివయ్య ఎంతో ఆప్యాయంగా తన కుమారుడి ఇటుకబట్టీ పెట్టేదిశలో ఆ వూరి వడ్డీ వ్యాపారి సహాయంతో ఏర్పాట్లు పూర్తిచేసుకొన్న విషయాన్ని తన దైన శైలితో చెప్పకుపోతుంటే ఒక్కసారిగా అగాధంలోకి కూరుకుపోతున్నట్లనిపించింది. ఎక్కువ వడ్డీకి వడ్డీ వ్యాపారి ఇచ్చిన సొమ్ముతో శివయ్య ఇటుకబట్టీ ప్రారంభించాడు. ఆ తర్వాత తీరిగ్గా తొమ్మిది నెలలకి బ్యాంకు వాళ్ళు శివయ్యకు లోన్ మంజూరు చేశారు. సొమ్ము చేతిలో పడే సమయానికి శివయ్య కుటంబపరమైన సంక్షోభాల్లో చిక్కుకుపోయాడు. శివయ్య పెద్ద కొడుక్కి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. తొమ్మిది నెలల వడ్డీ బకాయి మీద చక్రవడ్డీ సగం, కుటుంబ ఖర్చులకి సగం - బ్యాంక్ లోన్ సొమ్ము ఖర్చయిపోయింది. వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అదనంగా ఈ బ్యాంక్ లోన్, తన బాధలన్నీ ఏకరవు పెట్టి భోరుమన్నాడు శివయ్య, అతనికి ఏ సలహా ఇవ్వలేని దుస్థితి నాది.
బ్యాంకు వాళ్ళు సకాలంలో లోన్ ఇచ్చి వుంటే శివయ్య ఇంతటి సంక్షోభంలో పడి ఉండకపోను. అతను ఎక్కువవడ్డీకి ప్రైవేటు వ్యాపారస్తుడి నుంచి అప్పు తీసుకునేవాడు కాదు. అతనికి సకాలంలో ఎం దుకు లోన్ రాలేదంటే బ్యాంకు ఆ లోన్ స్కీముని పేదవారి పరిస్థితులకు, అవసరాలకు తగినట్లుగా రూపకల్పన చేయలేదు. అతనికి సకాలంలో లోన్ వచ్చివుంటే లోన్ మొత్తంలో సగం చక్రవడ్డీకి బలయ్యేది కాదు. చెల్లింపులు సరళంగా ఉంటాయి కాబట్టి తన కొడుకు అనా రోగ్యం ఖర్చుని కూడా ఎలాగో తట్టుకొని ఉండేవాడు. శివయ్య లాంటి పేదలు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడటానికి, అవసరాలకు ఆదుకోలేని సంక్షేమ పథకాలే ముఖ్య కారణం. శివయ్యకి బ్యాంకు ఇచ్చిన లోన్ని ఆంగ్లంలో వర్ణించాలంటే ‘గుడ్ ఫర్ నథింగ్, అండ్ ఫిట్ ఫర్ నథింగ్’.
పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మీకు హౌసింగ్లోను కావాలా! క్రెడిట్ కార్డులు కావాలా! కార్ల లోన్లు మంజూరు చేయమంటారా! అంటూ డబ్బున్నవాళ్ళ వెంటపడే బ్యాంకులు శివయ్యలాంటి కష్టజీవిని చేతనైన పని చేసుకోవటానికి కావల్సిన కనీస రుణ సదుపాయాన్ని అందివ్వలేని అసహాయ వ్యవస్థకు అద్దం పడుతున్నాయి. ఇదంతా తమ తలరాతని శివయ్య లాంటి వాళ్ళు ఎంతకాలం ఊరుకుంటారు? ఇది నన్ను ఎప్పటికీ భయపెట్టే ప్రశ్న!
- దాసరి శ్రీనివాసులు ఐఏఎస్
|
చదువు సర్వ రోగ నివారిణి
చదువు సర్వరోగ నివారిణి
Article published in Andhra Jyothi on 26.06.2015 | |||
|
Saturday, 7 November 2015
Subscribe to:
Posts (Atom)