Thursday 2 June 2016

భిన్నత్వంలో ఏకత్వ ‘ప్రకాశం’



                                                                                                    
   Andhra Jyothi                            31-05-2016 01:07:58
భిన్నత్వంలో ఏకత్వ ప్రకాశం

                   
ప్రపంచ ఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి గిత్తల ఘనత ప్రకాశం జిల్లా ఆనవాలుగా మిగిలింది. గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు బ్రెజిల్‌ దేశంలో ఒంగోలు జాతి ఆవుల ప్రదర్శనలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ గౌరవ శాసనసభ స్పీకరు ఈ విషయాన్ని గుర్తు చేయటం ముదావహము. 1938వ సంవత్సరంలో ఈ జాతి ఆవుల్ని తొలిసారిగా బ్రెజిల్‌ ప్రభుత్వం దిగుమతి చేసుకుని, అప్పటి నుంచి వాటిని సంరక్షిస్తూ, ప్రస్తుతం వాటి సంతతిని 16కోట్లకు చేర్చడం విశేషం. ఈ గిత్తల సంఖ్య మన రాష్ట్రంలో 2.50లక్షలు మాత్రమే ఉండటం గమనార్హం.

ఎన్నో ప్రత్యేకతల్ని తనలో ఇముడ్చుకున్న ప్రకాశం జిల్లా తన ప్రత్యేకతల్ని తనే చెప్పుకోవాల్సిన పరిస్థితి నేడు. నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో వంగవోలుప్రాంతంగా (అప్పట్లో ఒంగోలు నెల్లూరు ప్రాంతాలు కలిసి వుండేవి), ఆంధ్రప్రదేశ ఏర్పడ్డాక, ‘గజపతినగరం తాలూకా మరియు ఒంగోలు జిల్లా ఏర్పాటు చట్టం, 1970 ద్వారా ఒంగోలు కేంద్రంగా ఒంగోలు జిల్లా వ్యవస్థీకరింపబడి, ప్రకాశం జిల్లా (1972)గా నామాంతరం చెందింది. ధీరుడైన ఆంధ్రకేసరిటంగుటూరు ప్రకాశం పంతులుగారు అప్పటి ఒంగోలు తాలూకాలోని వల్లూరుగ్రామవాసి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడ్డ తరువాత ఏర్పడ్డ ఆంధ్రరాషా్ట్రనికి తొలిముఖ్యమంత్రి వారు. ఆ మహనుభావుడి పేర్న వెలిసిన ఈ జిల్లాలో కలెక్టర్ గా పనిచేయటం నా పూర్వజన్మ సుకృతం.
ఓకే తూరి మూడు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసిన అపుర్వమైన అనుభూతి మరియు వక్తిగత అనుభవాన్ని నాకు ప్రసాదించిన జిల్లా. అప్పటి ఇరువది జిల్లాల మురిపాల తల్లిరాషా్ట్రనికి ఇరవై ఒకటవ జిల్లాగా ఆవిష్కరించడబిన జిల్లా ఇది. మరో మూడేళ్లలో అర్ధ శతాబ్ధి జిల్లాగా ఉత్సవాలు జరుపుకోవాల్సిన జిల్లా. కొట్టొచ్చినట్లుగా మూడు సరిహద్దు జిల్లాల నుంచి మూడు రెవిన్యూ డివిజన్లను విడగొట్టి కొత్త జిల్లాగా నామకరణం చేశారు. కర్నూలు జిల్లా నుంచి మార్కాపురం డివిజను, గుంటూరు నుంచి ఒంగోలు డివిజను, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు డివిజను విడదీసి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ మూడు జిల్లా రెవిన్యూ డివిజన్లు ఆయా జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపబడినవే అన్న సద్విమర్శ కూడా ఉంది.

 గిద్దలూరు, కంభం, మార్కాపురం వాసులు అటు నంద్యాల, బద్వేలు (కడపజిల్లా), ఇటు కర్నూల్ జిల్లా ప్రాంత ప్రజల జీవన విధాన-ముతోమమేకదానమ మైఉంటారు. ఇక పొదిలి, దర్శి, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, ప్రాంత నివాసులు, కావాలి, ఉదయగిరి నెల్లూరు వాసులతో  సారూప్యం కల్గి వుండటం కద్దు. గతంలో గుంటూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఒంగోలు, అద్దంకి, మార్టూరు వాళ్ళు చిలకలూరిపేట, నరసరావుపేట (పేటలు) లతో సంబంధ భాంధవ్యాలు కల్గి వుండటం, చీరాల, పర్చూరు, కారం చేడు ప్రాంత ప్రజల ఇటు గుంటూరు, అటు బాపట్ల ప్రజలతో కలిసి వుండటం విశేషం  ఏమికాదు. వాళ్ళ బంధుత్వాలు, భావజాలం, ఆచార వ్యహారాలు, ఆర్దిక వనరులు, సంస్కృతి మూడు వేర్వేరు ప్రాంతాలతో ముడిపడి వున్నందు వల్ల భిన్నత్వంలో ఏకత్వం సాదించే దిశగా ఈ ప్రకారం జిల్లా వాసులు ఇంకా చాలా దూరం ప్రయాణం కొనసాగించాల్సి వుందన్నది నిర్వివాదంసం. పాలనా పరంగా జిల్లా ఒక్కటైనా, పరిపాలన దిశగా భిన్న మనస్తత్వాలు, విభిన్న ప్రాంతాలు దృష్టిలో వుంచుకొని జిల్లా ప్రగతిని నిర్దేశించాల్సిన ఆవశ్యకతను ఈ జిల్లా మనకు గుర్తు చేస్తుంది.  
  
అది యాదృచ్ఛికమో, యథార్థమో గాని నేను జిల్లా కలెక్టరుగా డ్వాక్రా మహిళలతో రెవిన్యూ డివిజన్లవారీగా తరచూ సమావేశాలు నిర్వహించి వాళ్ల అభ్యున్నతికి చర్యలు చేపట్టే దిశలో ఎదురైన స్వీయానుభవం ఒకటి ఈ సందర్భంగా గుర్తుకొస్తుంది. ఈ మహిళా బృందాలు వాళ్ల వాళ్ల గ్రామాల్లో మీటింగులు పెట్టుకున్నపుడు, అలాంటి సమీక్షా సమావేశాలకు ప్రత్యేక గుర్తింపుగా డ్రెస్‌కోడ్‌ ఉంటే బాగుంటుందనిపించింది. ఆ దిశలో వాళ్లకు ఇష్టమైన రంగు దుస్తులు యూనిఫాంగా ధరిస్తే కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన ప్రతిబింబింపజేయచ్చన్న నా సూచనకు అంగీకారం తెలుపుతూ ఆయా రెవిన్యూ డివిజన్ల ఆడవాళ్లు వాళ్లకిష్టమైన రంగులు సభల్లో వెల్లడించటం జరిగింది. మార్కాపూర్‌ డివిజన వాళ్లు ఆకుపచ్చ రంగు, కందుకూరు డివిజనవాళ్లు పసుపుపచ్చరంగు, ఒంగోలు డివిజన వాళ్లు నీలిరంగు చీరలు ధరించేలా నిర్ణయం తీసుకోవటం జరిగింది. తెల్లరవిక అందరూ కామనగా ధరించాలని అనుకున్నారు. ఈ సమష్టి ఆలోచనా విధానాన్ని లోతుగా అధ్యయనం చేస్తే నాకు గోచరించింది ఏమిటంటే - ప్రతి నిత్యం నల్లమల అడవుల సమీపంలో జీవనాన్ని సాగిస్తున్న మార్కాపూర్‌ ప్రాంత మహిళలు అందరూ ఆకుపచ్చరంగును ఎంచుకోవటం, అలాగే వాణిజ్య పంటలకు పేరు గాంచిన కందుకూరు డివిజను మహిళలు పసుపుపచ్చ రంగు ఇష్టపడటం, సదా సముద్రానికి దగ్గర్లో నివాసముంటున్న ఒంగోలు తీరప్రాంతవాసులు నీలిరంగును ఎంచుకోవటం వాళ్ల వాళ్ల ఆలోచనల్ని ప్రతిబింబింపచేసేవిగా ఉందని అనిపించింది నాకు. గ్రామీణ రైతాంగ కుటుంబాల్లో తెల్లరంగుకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిసిందే. ఈ మహిళల తెల్లరంగు రవికను ఎన్నుకోవట వాళ్ల నిర్మలత్వానికి నిదర్శనం. ప్రకాశం జిల్లా వాసుల ప్రత్యేకత నా భాషలో చెప్పాలంటే - వాళ్లకు ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా పట్టుకోవటం, తట్టుకోవటం ఎవరి తరమూ కాదు. ఈ భావోద్వేగాల్ని జిల్లా ప్రగతిబాటలో సమ్మిళితం చేసి, ప్రజానీకాన్ని మేమంతా ప్రకాశం జిల్లా వారసులమన్న ప్రగాఢ విశ్వాసంతో ముందుకు నడిపించాల్సిన అవసరాన్ని పాలకులు, ప్రజాప్రతినిధులు గుర్తించేఉంటారు ఈపాటికే.

ఈదిశగా అప్పట్లో చిరుప్రయత్నం చేయటం జరిగింది. కీ.శే డా. నాగభైరవ కోటేశ్వరరావు కవిగారి సహకారంతో జిల్లా ప్రశస్తిని, చరిత్రను, భౌగోళిక, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబింపజేసే ప్రకాశం జిల్లాగీతాన్ని రాయించి, భావి భారత పౌరులు గర్వపడేలా స్కూళ్లలో పాడింపజేశాం. విశ్వామిత్రసినిమా తీస్తున్నప్పుడు అన్నీ తానై అన్నగారికి అండగా నిలబడ్డ నాగభైరవ కోటేశ్వరరావు గారిని శ్రీ నందమూరి తారక రామారావుగారు ప్రేమగా కవిగారుఅని సంబోధించేవారట. ఆయనే ప్రకాశం జిల్లా వాసుల ఆత్మ ఒక్కటే, మనుష్యుల్లో మమత ఒక్కటే అన్న భావం స్ఫురించేలాగున జిల్లా అపురూప చరిత్రను అలరించేవిధంగా చెప్తూ ఈ గీతాన్ని రాశారు. దీన్ని జిల్లా అంతటా ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో, స్కూళ్లలో ప్రార్థనా గీతంగా విధిగా పాడుకునేలాగ ఆదేశాలుఇవ్వడం జరిగింది! డాక్టర్ నాగ బైరవకలం నుండి వెలువడిన గీతం ఇలాసాగుతోంది:
                                        ప్రకాశం జిల్లా గీతం
వందనం వందనం జన్మభూమి
ప్రకాశం జిల్లా మన మాతృభూమి

తూరుపుగా సాగరమే తోరణ పీటం
పడమర నలమల బంగారు మకుటం
కందుకూరు మార్టురులు వింజామరలై
కనిగిరి నీ సదనమే – పొదిలి నీకు హృదయమే                                            !!వందనం!!

బుద్దుని భోధలందెను త్రిపురాంతకము
ఎర్రన కవి భారతమే మన కంకితము
త్యాగరాజు గాన సుధాలహరులు మనవే
మహానట విలాసుడు – మన బండార్ రాముడు                                           !!వందనం!!

ఒంగోల్ గిత్తల ఘనతలు ఆనవాలుగా
మర్కాపూర్ పలకలు మన ఒనమలుగా
చీరలే చేనేతై, చీమకుర్తి గ్రానైటై
కంబం తటాకమే – ఘనకీర్తి పతాకమై                                                       !!వందనం!!

కాటమరాయని కదనపు సాహసగీతి
మోటుపల్లి తిప్పయ్య వాణిజ్యపు ఖ్యాతి
రామదండు గోపాలుని ఉద్యమ స్పూర్తి
ధీరుడాంధ్ర కేసరి -  ధైర్యం మన ఊపిరి                                                      !!వందనం!!

అద్దంకి గిద్దలూరు ఆత్మ ఒక్కటే
గుండ్లకమ్మ పాలేరుల గుండె ఒక్కటే !
మన జిల్లా మనుషుల్లో మమత ఒక్కటే
అపురూప చరిత్రవే – అలరించే ధాత్రివే!                                                      !!వందనం!!

గత నెల ప్రకాశం జిల్లా వెళ్లినపుడు చీమకుర్తి దగ్గర్లోగల పడమటినాయుడుపాలెం అప్పర్‌ ప్రైమరీ స్కూలును దర్శించాను. ముందస్తు సమాచారం లేదు. చెబితేగాని నేను ఎవరో పిల్లలకు తెలీదు, టీచర్లకు కూడా. అయినా ప్రార్థనా గీతంలో భాగంగా ఈ జిల్లా గీతాన్ని బాలబాలికలు ఆలపిస్తుంటే, ఎప్పుడో 17ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఆనవాయితీ ఈనాటికీ కొనసాగుతుందన్న తలంపుతో పులకించిపోవటం నావంతైంది. నేను కలెక్టరుగా పనిచేసిన కాలంలో ఈ ఏడేళ్ల కుర్రకుంకలు ఇంకా పుట్టివుండరు కూడా. సాధారణంగా అడ్మినిసే్ట్రషనలో ఆనవాయితీలను కొనసాగించటం అరుదు. పాత కలెక్టర్లు ప్రవేశపెట్టిన ఆలోచనల్ని తరువాత వచ్చినవాళ్లు కొనసాగించటానికి ఇష్టపడరు. ప్రిడెసెసర్స్‌’, ‘సక్సెసర్స్‌సిండ్రోమ్‌ అంటారు ఇంగ్లీషులో దీన్నే. నా తరువాత వచ్చిన జిల్లా కలెక్టర్లు ఈ గీతం ఆవశ్యకతను గుర్తించబట్టే కదా! జిల్లా సమగ్ర స్వరూపం మార్చి తీరాలన్న తపనే ఈ సంప్రదా యాల్ని కొనసాగిస్తుందన్నది.

నేటి,నాటి గౌరవ ముఖ్యమంత్రివర్యుల ఆలోచనా పరంపర నుంచి పుట్టుకొచ్చిన ప్రజలవద్దకు పాలన’, ‘శ్రమదానంవంటి ప్రగతిశీల పథకాల అమలు ఈ జిల్లా ప్రజానీకాన్ని ఎంతో ప్రభావితం చేయటమే గాకుండ అభివృద్ధి పథంలో మన జిల్లా ముందుండాలన్న ఆకాంక్షను కల్గజేసిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రజల కొరకు, ప్రజల ద్వారా, ప్రజల యొక్క కార్యక్రమాలుగా ప్రజానీకాన్ని మమేకం చేసిన ప్రభుత్వ పథకాలు ఇవి. జిల్లా పాలనాయంత్రాంగంలో నూతన ఉత్తేజాన్ని నింపి, జిల్లావాసుల్ని ఎంతగానో చైతన్యపరచటంలో ఈ రెండు వినూత్న ప్రయోగాలు కవలపిల్లల్లాగా లబ్ధిదారుల ప్రేమాభిమానాల్ని చూరగొన్నాయి. సిమెంట్‌ రోడ్లు, డ్రైన్లు, ఊరిబాటలు, చెరువులు, కాలువల మరమ్మత్తులు, స్కూళ్ల కాంపౌండ్లు, కమ్యూనిటీకి పనికి వచ్చే పనులు స్థానికుల సహకారంతో సమర్థవంతంగా అమలు చేయటానికి వీలైన శ్రమదానంఅప్పుడే ఐదంచెల పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో ఎన్నికైన మండలాధ్యక్షులు, యం.పి.టి.సి, జడ్‌.పి.టి.సి, సర్పంచుల ఉనికిని గుర్తించటంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడింది. ఈ ప్రజాప్రతినిధులు తీసుకున్న చొరవ అంతా ఇంతా కాదు. మండల వ్యవస్థను ప్రవేశపెట్టి, యువనాయకుల్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకు లభించపజేయటంలో కృతకృత్యులైన నాటి ప్రభుత్వాలు, ఈ కార్యక్రమం ద్వారా వాళ్లు ప్రజాసేవలో నిమగ్నమయ్యే వీలుకల్పించాయి. రెడ్‌టేపిజం, బ్యూరోక్రటిక్‌ ప్రతిబంధకాలు తగ్గించి నేరుగా గ్రామాలను, పట్టణాల్ని అభివృద్ధి చేసుకోవటానికి తోడ్పడేలా ఈ పథకాల్ని రూపొందించటం నాటి ప్రభుత్వం ఘనత. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ప్రజా సమస్యలను ప్రజల వద్దకు పాలనాపరంగా పరిష్కరించటం ఒకేతూరి జరగటం ఒక విప్లవాత్మక నిర్ణయం. నాటి పాలకుల పరిపక్వతకు నిదర్శనం. ఈ క్రమంలోనే జరిగిన ప్రయోగం పెండింగు ఫైళ్ల పరిష్కారంఒక ఉద్యమంలాగా సాగింది. ఈ కార్యక్రమాల అమల్లో ప్రకాశం జిల్లా ప్రథమంగా ఉండటం విశేషం. జిల్లా వాసుల ఘనత అది.

తరువాత వచ్చిన జన్మభూమికార్యక్రమం వీటి మిశ్రమఫలితం. ఆశించిన ఫలితాలు అందకపోవటానికి కారణం పథకంలో లోపాల కంటే ప్రజల్ని మమేకం చేయకపోవటమే, ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకంగా ముద్రపడటమే. పాలకులకు ప్రజలకు దూరం పెరగటం కూడా గమనించాల్సిన విషయం. ప్రభుత్వ పథకాల పబ్లిసిటీకి వేదికగా మారాయన్న విశ్లేషణ కూడా వుండేది. ఏది ఏమైనప్పటికీ నూతనంగా ఏర్పడ్డ తరువాత ప్రకాశం జిల్లా ప్రజల్ని ఒక వేదిక మీదకు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వ పథకాలదే అని చెప్పవచ్చు.

భౌగోళికపరంగా చూస్తే, జిల్లాను రెండు భాగాలుగా విభజించవచ్చు. చీరాల నుంచి సింగరాయకొండ వరకూ తీర ప్రాంతంగాను, కనిగిరి, పొదిలి, మార్కాపురం, కంభం, గిద్దలూరులను కరువు ప్రాంతాలుగాను.

సాంస్కృతికంగా, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ సంస్కృతుల కలయికగా ప్రకాశం జిల్లాను పరిగణించవచ్చు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్నందువల్ల ఈ భిన్న సంస్కృతుల ప్రభావం జిల్లాలో నేటికీ ప్రతిబింబిస్తుంది.
భిన్న సంస్కృతులు, ప్రాంతాల ప్రజల మధ్య ఏకత్వాన్ని చాటిచెప్పే సాటిలేని చిహ్నం గుండ్లకమ్మ’. పడమటి సరిహద్దుల్లో నల్లమల కోనల్లో గిద్దలూరు సమీపాన గుండ్ల బ్రహ్మేశ్వరంవద్ద పుట్టి, కంభం చెరువులో కలిసి, మార్కాపురం, అద్దంకి మీదుగా 280కి.మీ పొడవునా ప్రవహించి, ఒంగోలు వద్ద ఉలిచిగ్రామం ఆనుకొని బంగాళాఖాతంలో కలిసిపోయే ఈ నదీమతల్లి ఈ జిల్లావాసులకే స్వంతం, సర్వస్వం. జిల్లాలో పెద్ద నదులు ప్రవహించినప్పటికీ, చిన్నతరహానదులైన, ముసి, మన్నేరు, పాలేర్లు జిల్లావాసుల త్రాగు, సాగునీటి ఆయువుపట్టులు. అదేమి విచిత్రమోగానీ, ఈ మూడు నదులు పుట్టింది వెలుగొండలలోనైనా, మూడు వేర్వేరు దిశల్లో ప్రవహించి, జిల్లా అంతటిని ఒక చుట్టు చుట్టి, చివరగా మూడు చోట్ల సముద్రాన్ని చేరుకోవటం ప్రకృతి ప్రసాదించిన వరం. చిన్న నదులతో పాటు, చెరువులు, వాగులు అనేకం. కంభంచెరువు రాష్ట్రంలోకెల్లా పేరుబడ్డది. అద్దంకి ఆనుకుని భవనాశిచెరువు, శింగరాయకొండ సమీపాన పాకాలచెరువులు చెప్పుకోదగ్గ సాగునీటి వనరులు. వీటికి జవసత్వాలు యిచ్చే పంగలూరులోని ఇసుకవాగు’ (దీన్నే నాగులేరు అనికూడా అంటారు), వాగరవాగు, నల్లవాగు, వెదిమంగలవాగు, పర్చూరువాగు, స్వర్ణవాగు, ఆలేరువాగులు జిల్లా అంతటా విస్తరించి సమగ్ర ఆయకట్టు అభివృద్ధికి అనువుగా ఉండటం జిల్లా రైతాంగానికి ఊరట. ఇంతటి సానుకూలత రాష్ట్రంలో మరే జిల్లాకు లేదని చెప్పవచ్చు. మానవ శరీరంలో నాడీమండల వ్యవస్థ నమూనాలో ఈ వాగుల్ని, చెరువుల్ని, నదులతో అనుసంధిస్తూ అనువైన చోట్ల వరద ఉధృతిని మళ్లించి చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే.. మధ్య, పశ్చిమ ప్రకాశాన్ని కరువు రక్కసి నుంచి రక్షించినవాళ్లమవుతాం. పొదిలి, దర్శి, కనిగిరి ప్రాంతాల్లో ఫ్లోరైడు సమస్యను అధిగమించి సముద్రంలోకి నీరు వృధా కాకుండా కట్టడి చేసిన వాళ్లం అవుతాము. ఈ దిశలో ఇప్పటికే ఎన్నో ప్రణాళికలు, పథకాలు అమల్లో ఉండటం హర్షణీయం. వాటి సత్వర పూర్తి జిల్లా వాసుల చిరకాల వాంఛ.
ప్రకాశం జిల్లా ప్రధానంగా వ్యవసయధారితజిల్లా. 80% శాతానికి పైబడి గ్రామీణ జనాభా. పట్టణ ప్రాంతాలు అతిస్వల్పం. వ్యవసాయ కూలీలు/పాక్షిక కార్మికులు యాభై శాతానికి పైబడి వుండటం గమనార్హం. వలసలు కూడా ఎక్కువే. వ్యవసాయ పనులులో నేర్పు, విత్తనాభివుద్దిలో నైపుణ్యం ఈ జిల్లా రైతాంగాన్ని దక్షిణాది రాష్ట్రల్లో అగ్ర గామిగా నిలబెట్టాయి.వాణిజ్య పంటలు పండించటంలో వీరికివీరే సాటి. సేద్యంతో పాడి జత కట్టి వుండటం వల్ల తరచుగా పంటలు దెబ్బతిన్నా, నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళటానికి వెసులుబాటువుంది. వ్యవసాయ, అనుబంధ, పశుసంవర్ధక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుంది.
వ్యవసాయేతర రంగానికి వస్తే, పడమర నల్లమల అటవీ సంపద, తూర్పున 110 కి.మీ పొడువునా విస్తరించిన తీర ప్రాంతం ఈ జిల్లాలకు సహజ సిద్దంగా అమరిన వనరులు. చెంచులు, పల్లెకార్లకు జీవనాదారాలు కూడా. నిర్మాణరంగంలో కనిగిరి, కందుకూరు, టంగుటూరు, సింగరాయకొండ సుతారిలు, మేస్త్రీలు మహానగర భవన నిర్మాణంలో తమ సత్తాను చాటుతున్నారు వలస కూలీలుగా. వృత్తి పరంగా వీరి ప్రావిణ్యం, పనితనము చెప్పానలని కానిది. చీరాల చేనేత. చీమకుర్తి గెలాక్సీ గ్రానైటు. మార్కాపురం పలకలు జిల్లాకే మకుటాయమానాలు. ఉప్పు గుండూరు ఉప్పు తయారీ, సముద్ర ఉత్పత్తులు, ఆక్వారంగానికి చేయూతనిచ్చే హేచరీలు, శీతల గిడ్డంగులు, పండ్ల ప్రాసెసింగుయూనిట్స్ కాగితం తయారి పరిశ్రమలకు  పెద్ద పీట వేయాల్సిన సమయం ఇది. వేటపాలెం జీడిపప్పు రుచేవేరు. ఉలవపాడు మామిడిపళ్ళ వునికే చాలు. ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ది కేక్కిన ఓడరేవు, మోటుపల్లి, కొత్తపట్నం, రామాయపట్నం రేవులు తిరిగి ఊపందుకోవాల్సిన తరుణమిది.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సహకరించే ఇన్ని వనరులు సంతరించుకున్న ప్రకాశం జిల్లా వెనుకబాటు తనాన్ని అధిగమించటలో సహజ వనరుల్ని పునికి పుచ్చుకొని మానవ వనరులు ఆర్దిక పరి పుష్టికి కృషి చేయాల్సిన అవసరంఉంది. సంక్షేంమం – అభివృద్ధి పధకాలు సమాతరంగా కొనసంగిచాల్సి వుంది ఈ దిశగా. మూడు సంస్కృతుల సంగమంతో నూతన సంస్కృతిని, దృక్పదాన్ని జిల్లా వాసుల్లో ఆవిష్కరించాల్సిన ఆగత్యం వుంది. సాంస్కృతిక, సామజిక మార్పులు ఆర్దిక అభివృద్ధికి  అద్దం పట్టాలి. అలోచనల్ని రేకెత్తించాలి.                 
·          డా. దాసరి శ్రీనివాసులు,
           సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి
      sanchari.hyd@gmail.com