Tuesday 10 November 2015


పేదోడి నమ్మకం, అసహాయ వ్యవస్థ - దాసరి శ్రీనివాసులు

Updated :05-03-2015 00:23:37


 శివయ్య లాంటి పేదలు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడటానికి, అవసరాలకు ఆదుకోలేని సంక్షేమ పథకాలే ముఖ్య కారణం. శివయ్యకి బ్యాంకు ఇచ్చిన లోన్‌ని ఆంగ్లంలో వర్ణించాలంటే ‘గుడ్‌ ఫర్‌ నథింగ్‌, అండ్‌ ఫిట్‌ ఫర్‌ నథింగ్‌’.

‘నే తి బువ్వ తినేవాళ్లు అబద్ధం చెప్పరుగందా బాబుగారూ!’ అంటూ అమాయకంగా నా వైపు చూస్తున్న సుతారి శివయ్యను చూసి నవ్వుకున్నాను.

గత ఆరునెలలుగా ఒక జాతీయ బ్యాంకు చుట్టూ అప్పుకోసం తిరుగుతున్నాడు శివయ్య. వెళ్ళిన ప్రతిసారీ బ్యాంకు మేనేజరు శివయ్యకు ఆశ చావకుండా ఏదో సమాధానం చెప్పి పంపుతున్నాడు. కానీ అప్పు మాత్రం చేతికి అందటం లేదు. వచ్చే వారం తప్పకుండా లోను శాంక్షన్‌ అవుతుందన్న మేనేజరు హామీని నాకు చేరవేసేవాడు. ‘చదువుకుని ఉద్యోగం చేసేవాళ్ళు, సమాజంలో ఇతరులకి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లంగా నేతి బువ్వ తినేవాళ్ళని, వాళ్ళు అబద్ధాలు చెప్పర’ని శివయ్య మొరటు విశ్వాసం.
ఆ ప్రాంతానికి పదవిరీత్యా పెద్ద ఉద్యోగాన్ని వెలగబెడుతున్న నేను కూడా శివయ్యలో ఆశలు రేకెత్తించడానికి చెప్పాలంటే ఒక విధంగా కారకుణ్ణి. నా క్వార్టరు పక్కనే కొద్ది దూరంలో ఒక చిన్న ఇంట్లో శివయ్య కాపురముంటున్నాడు. వృత్తిరీత్యా సుతారి. ఇటుకల బట్టీ నిర్వహణలో కూడా నేర్పరి. ఉన్నంతలో సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నాడు. చదువుకుంటే పెద్ద ఉద్యోగాలు వస్తాయని, పిల్లలు సుఖపడుతారనే ఆశతో తన ఇద్దరు కుమారుల్లో చిన్నవాణ్ణి కష్టపడి బి.ఎ. వరకు చదివించాడు. పెద్దవాడు యుక్తవయసు రాగానే తండ్రికి చేదోడువాదోడుగా సుతారి పనిలో సాయంగా ఉంటున్నాడు.

ఒకరోజు సాయంత్రం క్యాంపు నుంచి తిరిగి వస్తూనే గేటు దగ్గర శివయ్య బి.ఎ. చదివిన కొడుకుని వెంటబెట్టుకొని నా క్వార్టరువైపు రావటంచూసి ‘ఏం శివయ్యా! నాతో పనేమైనా పడిందా!’ అని ఆప్యా యంగా పలకరించాను. చదువుకొని నిరుద్యోగిగా ఉన్న తన కొడుక్కి ప్రభుత్వపరంగా ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని అభ్యర్థించాడు.

చదువుకొన్న నిరుద్యోగయువతకు స్వయం ఉపాధి కల్పించే దిశలో ఎన్నో పథకాలు అమలు జరుగుతున్న రోజుల్లో ఇటుకల బట్టీ పెట్టుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చింది నేనే. ప్రభుత్వోద్యోగం ఇప్పించే ఉద్దేశం లేకనే ఇలా చెబుతున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా నిండు విశ్వాసంతో నా మాట విని బ్యాంకు చుట్టూ విసుగు విరామం లేకుండా తిరుగుతున్న శివయ్యని, అతని కొడుకుని చూస్తుంటే పేదవాళ్ళలో ఈ వ్యవస్థపై ఇంకా నమ్మకం ఉందని అని పించింది. నెలరోజుల తర్వాత శివయ్య కుమారుడు తారసపడి బ్యాంకువాళ్లు పెడుతున్న మెలికల్ని ఏకరువు పెట్టాడు. ఇటుకబట్టీ పెట్టాలంటే సీజన్‌ కంటే రెండు మూడు నెలల ముందు కూలీల జట్లకు అడ్వాన్సులు ఇవ్వాలి. ఇటుక కాల్చడానికి కావల్సిన బొగ్గు, కట్టెల కొనుగోలుకు ముందుగానే కొంత ఖర్చు చేసిన సామగ్రిని సమకూర్చుకోవాలి. అలాగే ఇటుక బట్టీ పెట్టుకోవడానికి అవసరమైన ఎర్ర మట్టి నేలను లీజుకు తీసుకోవాలి. ఈ ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలంటే.. కొంత అడ్వాన్సుగా లోను మంజూరుచేసే వీలులేదని బ్యాంకర్‌ వాదన. మరి లబ్ధిదారే తన సొంతవనరులతో ఈ ఏర్పాట్లు చేసుకోవాలంటే గగనమైన పని, స్కీంలన్నీ సిద్ధాంతపరంగా బాగానే ఉంటాయి, కానీ అమలు చేయటంలో ఎదురయ్యే ఇబ్బందులు లబ్ధిదారులకు మాత్రమే ఎరుక.
నా హోదా వుపయోగించి బ్యాంకు మేనజర్ని ఒప్పించగలనన్న ధైర్యంతో వారం రోజుల తర్వాత కలుసుకోమని శివయ్య కుమారుణ్ణి పంపించి వేశాను. తీరా బ్యాంకు వాళ్లతో మాట్లాడిన తర్వాత వాళ్లు ఇచ్చిన వివరణ చూశాక అవాక్కవటం నా వంతు అయింది. ఏతా వాతా వాళ్ళు చెప్పింది, ఏమిటంటే అసలు స్కీమ్‌ రూపకల్పనలో అడ్వాన్సు ఇచ్చే అంశాన్ని పొందుపరచలేదని, లబ్ధిదారు సొంత వనరులతో సమకూర్చుకొనే సామగ్రికి వాల్యుయేషన్‌ చేయించి లోను రిలీజు చేయటం వరకే తమ వంతు సహాయం అని ఎంతో నేర్పుగా, ఓర్పుగా బ్యాంకు ఫీల్డు ఆఫీసరు ఇచ్చిన సమాచారం శివయ్య కుటుంబానికి ఎలా తెలియజేయాలో నా ఊహకి అందలేదు. ఈ స్కీము నిబంధనలు రూపొందించడంలో లబ్ధిదారుని ప్రమేయం ఎంతమేరకు అన్న ఆలోచన లేని సంస్థల పనితీరు గూర్చి సిగ్గుపడాల్సింది మేము కాదు. 15 రోజుల తర్వాత నమస్కరిస్తూ ఎదురుపడ్డ శివయ్య ఎంతో ఆప్యాయంగా తన కుమారుడి ఇటుకబట్టీ పెట్టేదిశలో ఆ వూరి వడ్డీ వ్యాపారి సహాయంతో ఏర్పాట్లు పూర్తిచేసుకొన్న విషయాన్ని తన దైన శైలితో చెప్పకుపోతుంటే ఒక్కసారిగా అగాధంలోకి కూరుకుపోతున్నట్లనిపించింది. ఎక్కువ వడ్డీకి వడ్డీ వ్యాపారి ఇచ్చిన సొమ్ముతో శివయ్య ఇటుకబట్టీ ప్రారంభించాడు. ఆ తర్వాత తీరిగ్గా తొమ్మిది నెలలకి బ్యాంకు వాళ్ళు శివయ్యకు లోన్‌ మంజూరు చేశారు. సొమ్ము చేతిలో పడే సమయానికి శివయ్య కుటంబపరమైన సంక్షోభాల్లో చిక్కుకుపోయాడు. శివయ్య పెద్ద కొడుక్కి అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయించవలసి వచ్చింది. తొమ్మిది నెలల వడ్డీ బకాయి మీద చక్రవడ్డీ సగం, కుటుంబ ఖర్చులకి సగం - బ్యాంక్‌ లోన్‌ సొమ్ము ఖర్చయిపోయింది. వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అదనంగా ఈ బ్యాంక్‌ లోన్‌, తన బాధలన్నీ ఏకరవు పెట్టి భోరుమన్నాడు శివయ్య, అతనికి ఏ సలహా ఇవ్వలేని దుస్థితి నాది.
బ్యాంకు వాళ్ళు సకాలంలో లోన్‌ ఇచ్చి వుంటే శివయ్య ఇంతటి సంక్షోభంలో పడి ఉండకపోను. అతను ఎక్కువవడ్డీకి ప్రైవేటు వ్యాపారస్తుడి నుంచి అప్పు తీసుకునేవాడు కాదు. అతనికి సకాలంలో ఎం దుకు లోన్‌ రాలేదంటే బ్యాంకు ఆ లోన్‌ స్కీముని పేదవారి పరిస్థితులకు, అవసరాలకు తగినట్లుగా రూపకల్పన చేయలేదు. అతనికి సకాలంలో లోన్‌ వచ్చివుంటే లోన్‌ మొత్తంలో సగం చక్రవడ్డీకి బలయ్యేది కాదు. చెల్లింపులు సరళంగా ఉంటాయి కాబట్టి తన కొడుకు అనా రోగ్యం ఖర్చుని కూడా ఎలాగో తట్టుకొని ఉండేవాడు. శివయ్య లాంటి పేదలు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడటానికి, అవసరాలకు ఆదుకోలేని సంక్షేమ పథకాలే ముఖ్య కారణం. శివయ్యకి బ్యాంకు ఇచ్చిన లోన్‌ని ఆంగ్లంలో వర్ణించాలంటే ‘గుడ్‌ ఫర్‌ నథింగ్‌, అండ్‌ ఫిట్‌ ఫర్‌ నథింగ్‌’.
పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మీకు హౌసింగ్‌లోను కావాలా! క్రెడిట్‌ కార్డులు కావాలా! కార్ల లోన్లు మంజూరు చేయమంటారా! అంటూ డబ్బున్నవాళ్ళ వెంటపడే బ్యాంకులు శివయ్యలాంటి కష్టజీవిని చేతనైన పని చేసుకోవటానికి కావల్సిన కనీస రుణ సదుపాయాన్ని అందివ్వలేని అసహాయ వ్యవస్థకు అద్దం పడుతున్నాయి. ఇదంతా తమ తలరాతని శివయ్య లాంటి వాళ్ళు ఎంతకాలం ఊరుకుంటారు? ఇది నన్ను ఎప్పటికీ భయపెట్టే ప్రశ్న!

- దాసరి శ్రీనివాసులు  ఐఏఎస్‌

చదువు సర్వ రోగ నివారిణి

చదువు సర్వరోగ నివారిణి 
Article published in Andhra Jyothi on 26.06.2015 
చదువు సర్వరోగ నివారిణి
Updated :26-06-2015 01:16:04
కొచ్చి విమానాశ్రయం నుంచి నేను చేరాల్సిన గమ్యానికి టాక్సీ మాట్లాడుకొని బయలుదేరాను. పచ్చని పరిసరాల మధ్యలో భూతల స్వర్గం (దేవుని స్వస్థలం)గా భావించే కేరళ రాష్ట్రంలో హాయిగా సాగుతోంది నా ప్రయాణం. నా వాహన డ్రైవర్‌ సునీల్‌ ఆంగ్లంలో అవలీలగా మాట్లాడగల మాటకారి. నా అలవాటు ప్రకారం ఆ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు సునీల్‌ ద్వారా వీలైనంత వరకు రాబట్టాలన్న తపనతో అతనితో సంభాషించడం మొదలు పెట్టాను. ‘మా ఛీఫ్‌ మినిస్టర్‌ నాలాంటి సామాన్యులకు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు సార్‌’ అంటూ వాళ్ళ రాష్ట్ర పరిపాలన తీరుతెన్నులు గూర్చి అడిగినప్పుడు టక్‌ మని సునీల్‌ ఇచ్చిన సమాధానం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
రెండు నెలల క్రితం తను కేరళ సీఎంను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఇట్లా పర్యటనలకు వచ్చినప్పుడు కూడా అతి సామాన్యుడు ఎంతో సులువుగా పాలకులను కలవచ్చని తనదైన శైలిలో చెప్పుకుపోతున్నాడు సునీల్‌. పనివేళల పట్టింపులేమీ ఆయన పెద్దగా పాటించరని తెలిసింది. తన చెల్లెలు, ఆమె భర్త రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతే వారి ఇద్దరి కుమార్తెలకు సహాయం చేయమని రాత్రి 11గంటల సమయంలో కేరళ సీఎంను కలిసి అర్జీ ఇవ్వడం విని నాలో ఒకింత సందిగ్ధానికి తావిచ్చింది. అయితే డ్రైవర్‌ డ్యూటీ టైంలో కలిస్తే సంపాదన నష్టంకాబట్టి, డ్యూటీ కాలం ముగిసినతర్వాత రాత్రి 11 గంటల సమయంలో తన చెల్లెలు ఇద్దరు కూతుళ్ళను వెంటబెట్టుకొని వెళ్ళి సీఎంను కలిసినట్లు సునీల్‌ చెబుతుంటే ఆలోచనలో పడటం నా వంతైంది. అక్షరాస్యత క్రమంలో కేరళ రాష్ట్రం యాభై ఏళ్ళ క్రితమే వందశాతం సొంతం చేసుకుంది. చదువు ప్రాముఖ్యం సునీల్‌ వంటి ఆలోచనాపరుల్ని తయారు చేసిందని ఇంతకంటే చక్కని ఉదా హరణ ఇంకొకటి ఉండదు. అందుకే చదువును మించిన ఆస్తి లేదు.
టూకీగా అతని మాటల్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏమి టంటే.. తన చెల్లెలు భర్త ఒక చిరుద్యోగి, హౌసింగ్‌బోర్డ్‌ ఎలాట్‌ చేసిన ఇంట్లో కాపురం ఉండేవారు. ఆ ఇంటి కేటాయింపు సంబంధించిన వాయిదాలు పోగా, ఇంకా నాలుగు లక్షలు బకాయి వుందట. ఆ బాకీ రాబట్టుకునేందుకు హౌసింగ్‌ బోర్డు వాళ్ళు ఇంటిని వేలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అనాధలైన ఇద్దరు ఆడ కూతుర్లు స్థిరాస్తి కోల్పోతే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. అనాధల భారం ప్రభుత్వానిదే. అందుకే ఆ లోను మాఫీ చేసి, ఆడపిల్లల పేరున ఇల్లు కొనసాగించాలని ఆర్డర్‌ఇవ్వాల్సిందిగా సీఎంను అభ్యర్థించాడట. అలా ఎలా కుదురుతుంది సునీల్‌! ఇల్లు అమ్మి బాకీ తీర్చాలి కదా! గవర్నమెంట్‌ ఇలా మాఫీ చేసుకుంటూ పోతే, ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతోంది అని ఉచిత సలహా ఇచ్చాను.
‘ఇదే విషయం హౌసింగ్‌ బోర్డు వాళ్ళూ చెప్పారు సార్‌! గవర్నమెంట్‌ వేలం వేసిన తరువాత వచ్చిన డబ్బుతో బకాయి మినహాయించుకుని, మిగులు డబ్బులు ఇద్దరు ఆడ పిల్లల పేరున డిపాజిట్‌ చేసుకోవచ్చు కదా అని. ఆ డబ్బు ఎన్నిరోజులకు సరిపోతుంది సార్‌! అదే ఇళ్ళు వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళకు ఒక ఆశ్రయం ఉన్నట్లుంటుంది. పిల్లలు పెరిగి, సంపాదన పరులు అయ్యేంతవరకు వాళ్ళను బోర్డింగ్‌ స్కూల్లో పెట్టి చదవించవచ్చు. నెలసరి ఇంటి అద్దె వారికి ఖర్చులకు పనికివస్తుంది. ఆస్తి వాళ్ళపేరున ఉంటుంది కాబట్టి పిల్లల పెళ్ళిళ్ళు కూడా సులువుగా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో అందుకే వాళ్ళ సంరక్షణ పూర్తి బాధ్యత గవర్నమెంటుదే. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు ప్రభుత్వానికి చెందినవారవుతారు కదా. ఆ భారం వాళ్ళదే అంటూ సుదీర్ఘంగా కాన్ఫిడెంటుగా లాజికల్‌గా సునీల్‌ చెప్పుకుంటూ పోతుంటే నా మెదడులో ఉన్న ఆలోచనలు పటా పంచలైనాయి. పిల్లల పేరున ఉన్న ఆస్తిని కొట్టేసి, వాళ్ళను అనాధలుగా మిగుల్చుతాడని ఊహించిన నేను తలదించుకోవాల్సి వచ్చింది. ఎంతో ఆత్మవిశ్వాసం. ఎంతో ఉదాత్తమైన ఆలోచన. సునీల్‌ చూస్తుంటే ఒకింత గర్వం అనిపించింది. దీనికంతటికీ కారణం అతను చదువుతో పాటు, సభ్యతా, సంస్కారాన్ని అలవరచుకోవటమే. విద్య ఉండి, వింత పశువుల్లా ప్రవర్తించే వాళ్ళకు భిన్నంగా.
అంత రాత్రి వేళ సునీల్‌ గాథను ఓపికగా విన్న సీఎం వెంటనే చర్య తీసుకున్నారట. వాళ్ళు గ్రామానికి తిరిగి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు తమ ఇంటికి వచ్చి సత్వరమే సమాచారం సేకరించి తగిన చర్యలు చేపట్టారట. ఈ విషయాన్ని వింటుంటే ఒక పబ్లిక్‌ సర్వెంటుగా నాకే నమ్మకం కుదరటం లేదు. వ్యవస్థ ఇంత చురుగ్గా పనిచేయడం గురించి బాధితుడే స్వయంగా చెబుతుంటే నమ్మాల్సి వచ్చింది. ఇది జరిగి రెండు నెలలు అయిందంట. మరి నీ సమస్యకు పరిష్కారం దొరికిందా అని ఆతృతగా అడిగాను. తన కుటుంబ సమస్యల పట్ల నేను చూపుతున్న ఆసక్తి గమనించి, ‘అంత త్వరగా ఎట్లా అవుతుంది సార్‌! సీఎం, కలెక్టర్‌ శ్రద్ధ తీసుకుంటే సరిపోదు. కింది వాళ్ళు కూడా అంత వేగంగా పనిచేయాలి గదా! కిందిస్థాయి సిబ్బంది శ్రద్ధ మీద ఆధారపడుతోంది. సీఎం, కలెక్టర్‌ వచ్చి కింది వాళ్ళ పని చేయరు కదా’ అంటుంటే సునీల్‌కు వ్యవస్థ పట్ల, ప్రభుత్వ యంత్రాంగం పని తీరుపట్ల ఎంత అవగాహన ఉందో అర్థమయింది.
‘తప్పకుండా ప్రభుత్వం నా చెల్లెలు పిల్లల్ని ఆదుకుంటుందన్న నమ్మకం నాకుంది సార్‌! కొంత ఆలస్యం కావచ్చు కానీ, పని అవుతుంది’ అన్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసిన సునీల్‌ను మనసులోనే మనసారా అభినందించకుండా ఉండలేకపోయాను. బీదా బిక్కి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశలో సంక్షేమ పథకాలు రూపుదిద్దుకోవాల్సిన అవసరాన్ని సునీల్‌ నాకు పరోక్షంగా గుర్తుకుతెచ్చాడు.
హెడ్‌ క్వార్టర్స్‌కు వచ్చిన తర్వాత ట్యాక్సీ దిగుతున్న సందర్భంగా సునీల్‌ను అడిగి తెలుసుకున్న అడ్రస్‌ ఆధారంగా ఆ జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌చేసి సునీల్‌ కుటుంబానికి సత్వర న్యాయం జరిగే లాగా కృషి చేయవలసిందిగా వ్యక్తిగతంగా కోరాను. నా హోదాను, ఉనికిని సునీల్‌కి తెలియజేయటం ఇష్టం లేదు. అవసరమైన ఆశల్ని రేకెత్తించటం అసలే మంచిది కాదనిపించింది. ఆ విధంగా నా వంతు మాట సహాయాన్ని అందజేశాన్న సంతృప్తితో, నిర్మలమైన (స్వచ్ఛ), ఆరోగ్యవంతమైన ఆలోచనలు కలిగి ఉన్న సగటు భారతీయుణ్ణి సునీల్‌లో ఊహించుకుంటూ ఉప్పొంగిపోవటం నావంతైంది.
- దాసరి శ్రీనివాసులు