Tuesday 10 November 2015

చదువు సర్వ రోగ నివారిణి

చదువు సర్వరోగ నివారిణి 
Article published in Andhra Jyothi on 26.06.2015 
చదువు సర్వరోగ నివారిణి
Updated :26-06-2015 01:16:04
కొచ్చి విమానాశ్రయం నుంచి నేను చేరాల్సిన గమ్యానికి టాక్సీ మాట్లాడుకొని బయలుదేరాను. పచ్చని పరిసరాల మధ్యలో భూతల స్వర్గం (దేవుని స్వస్థలం)గా భావించే కేరళ రాష్ట్రంలో హాయిగా సాగుతోంది నా ప్రయాణం. నా వాహన డ్రైవర్‌ సునీల్‌ ఆంగ్లంలో అవలీలగా మాట్లాడగల మాటకారి. నా అలవాటు ప్రకారం ఆ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు సునీల్‌ ద్వారా వీలైనంత వరకు రాబట్టాలన్న తపనతో అతనితో సంభాషించడం మొదలు పెట్టాను. ‘మా ఛీఫ్‌ మినిస్టర్‌ నాలాంటి సామాన్యులకు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు సార్‌’ అంటూ వాళ్ళ రాష్ట్ర పరిపాలన తీరుతెన్నులు గూర్చి అడిగినప్పుడు టక్‌ మని సునీల్‌ ఇచ్చిన సమాధానం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
రెండు నెలల క్రితం తను కేరళ సీఎంను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఇట్లా పర్యటనలకు వచ్చినప్పుడు కూడా అతి సామాన్యుడు ఎంతో సులువుగా పాలకులను కలవచ్చని తనదైన శైలిలో చెప్పుకుపోతున్నాడు సునీల్‌. పనివేళల పట్టింపులేమీ ఆయన పెద్దగా పాటించరని తెలిసింది. తన చెల్లెలు, ఆమె భర్త రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతే వారి ఇద్దరి కుమార్తెలకు సహాయం చేయమని రాత్రి 11గంటల సమయంలో కేరళ సీఎంను కలిసి అర్జీ ఇవ్వడం విని నాలో ఒకింత సందిగ్ధానికి తావిచ్చింది. అయితే డ్రైవర్‌ డ్యూటీ టైంలో కలిస్తే సంపాదన నష్టంకాబట్టి, డ్యూటీ కాలం ముగిసినతర్వాత రాత్రి 11 గంటల సమయంలో తన చెల్లెలు ఇద్దరు కూతుళ్ళను వెంటబెట్టుకొని వెళ్ళి సీఎంను కలిసినట్లు సునీల్‌ చెబుతుంటే ఆలోచనలో పడటం నా వంతైంది. అక్షరాస్యత క్రమంలో కేరళ రాష్ట్రం యాభై ఏళ్ళ క్రితమే వందశాతం సొంతం చేసుకుంది. చదువు ప్రాముఖ్యం సునీల్‌ వంటి ఆలోచనాపరుల్ని తయారు చేసిందని ఇంతకంటే చక్కని ఉదా హరణ ఇంకొకటి ఉండదు. అందుకే చదువును మించిన ఆస్తి లేదు.
టూకీగా అతని మాటల్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏమి టంటే.. తన చెల్లెలు భర్త ఒక చిరుద్యోగి, హౌసింగ్‌బోర్డ్‌ ఎలాట్‌ చేసిన ఇంట్లో కాపురం ఉండేవారు. ఆ ఇంటి కేటాయింపు సంబంధించిన వాయిదాలు పోగా, ఇంకా నాలుగు లక్షలు బకాయి వుందట. ఆ బాకీ రాబట్టుకునేందుకు హౌసింగ్‌ బోర్డు వాళ్ళు ఇంటిని వేలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అనాధలైన ఇద్దరు ఆడ కూతుర్లు స్థిరాస్తి కోల్పోతే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. అనాధల భారం ప్రభుత్వానిదే. అందుకే ఆ లోను మాఫీ చేసి, ఆడపిల్లల పేరున ఇల్లు కొనసాగించాలని ఆర్డర్‌ఇవ్వాల్సిందిగా సీఎంను అభ్యర్థించాడట. అలా ఎలా కుదురుతుంది సునీల్‌! ఇల్లు అమ్మి బాకీ తీర్చాలి కదా! గవర్నమెంట్‌ ఇలా మాఫీ చేసుకుంటూ పోతే, ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతోంది అని ఉచిత సలహా ఇచ్చాను.
‘ఇదే విషయం హౌసింగ్‌ బోర్డు వాళ్ళూ చెప్పారు సార్‌! గవర్నమెంట్‌ వేలం వేసిన తరువాత వచ్చిన డబ్బుతో బకాయి మినహాయించుకుని, మిగులు డబ్బులు ఇద్దరు ఆడ పిల్లల పేరున డిపాజిట్‌ చేసుకోవచ్చు కదా అని. ఆ డబ్బు ఎన్నిరోజులకు సరిపోతుంది సార్‌! అదే ఇళ్ళు వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళకు ఒక ఆశ్రయం ఉన్నట్లుంటుంది. పిల్లలు పెరిగి, సంపాదన పరులు అయ్యేంతవరకు వాళ్ళను బోర్డింగ్‌ స్కూల్లో పెట్టి చదవించవచ్చు. నెలసరి ఇంటి అద్దె వారికి ఖర్చులకు పనికివస్తుంది. ఆస్తి వాళ్ళపేరున ఉంటుంది కాబట్టి పిల్లల పెళ్ళిళ్ళు కూడా సులువుగా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో అందుకే వాళ్ళ సంరక్షణ పూర్తి బాధ్యత గవర్నమెంటుదే. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు ప్రభుత్వానికి చెందినవారవుతారు కదా. ఆ భారం వాళ్ళదే అంటూ సుదీర్ఘంగా కాన్ఫిడెంటుగా లాజికల్‌గా సునీల్‌ చెప్పుకుంటూ పోతుంటే నా మెదడులో ఉన్న ఆలోచనలు పటా పంచలైనాయి. పిల్లల పేరున ఉన్న ఆస్తిని కొట్టేసి, వాళ్ళను అనాధలుగా మిగుల్చుతాడని ఊహించిన నేను తలదించుకోవాల్సి వచ్చింది. ఎంతో ఆత్మవిశ్వాసం. ఎంతో ఉదాత్తమైన ఆలోచన. సునీల్‌ చూస్తుంటే ఒకింత గర్వం అనిపించింది. దీనికంతటికీ కారణం అతను చదువుతో పాటు, సభ్యతా, సంస్కారాన్ని అలవరచుకోవటమే. విద్య ఉండి, వింత పశువుల్లా ప్రవర్తించే వాళ్ళకు భిన్నంగా.
అంత రాత్రి వేళ సునీల్‌ గాథను ఓపికగా విన్న సీఎం వెంటనే చర్య తీసుకున్నారట. వాళ్ళు గ్రామానికి తిరిగి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు తమ ఇంటికి వచ్చి సత్వరమే సమాచారం సేకరించి తగిన చర్యలు చేపట్టారట. ఈ విషయాన్ని వింటుంటే ఒక పబ్లిక్‌ సర్వెంటుగా నాకే నమ్మకం కుదరటం లేదు. వ్యవస్థ ఇంత చురుగ్గా పనిచేయడం గురించి బాధితుడే స్వయంగా చెబుతుంటే నమ్మాల్సి వచ్చింది. ఇది జరిగి రెండు నెలలు అయిందంట. మరి నీ సమస్యకు పరిష్కారం దొరికిందా అని ఆతృతగా అడిగాను. తన కుటుంబ సమస్యల పట్ల నేను చూపుతున్న ఆసక్తి గమనించి, ‘అంత త్వరగా ఎట్లా అవుతుంది సార్‌! సీఎం, కలెక్టర్‌ శ్రద్ధ తీసుకుంటే సరిపోదు. కింది వాళ్ళు కూడా అంత వేగంగా పనిచేయాలి గదా! కిందిస్థాయి సిబ్బంది శ్రద్ధ మీద ఆధారపడుతోంది. సీఎం, కలెక్టర్‌ వచ్చి కింది వాళ్ళ పని చేయరు కదా’ అంటుంటే సునీల్‌కు వ్యవస్థ పట్ల, ప్రభుత్వ యంత్రాంగం పని తీరుపట్ల ఎంత అవగాహన ఉందో అర్థమయింది.
‘తప్పకుండా ప్రభుత్వం నా చెల్లెలు పిల్లల్ని ఆదుకుంటుందన్న నమ్మకం నాకుంది సార్‌! కొంత ఆలస్యం కావచ్చు కానీ, పని అవుతుంది’ అన్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసిన సునీల్‌ను మనసులోనే మనసారా అభినందించకుండా ఉండలేకపోయాను. బీదా బిక్కి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశలో సంక్షేమ పథకాలు రూపుదిద్దుకోవాల్సిన అవసరాన్ని సునీల్‌ నాకు పరోక్షంగా గుర్తుకుతెచ్చాడు.
హెడ్‌ క్వార్టర్స్‌కు వచ్చిన తర్వాత ట్యాక్సీ దిగుతున్న సందర్భంగా సునీల్‌ను అడిగి తెలుసుకున్న అడ్రస్‌ ఆధారంగా ఆ జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌చేసి సునీల్‌ కుటుంబానికి సత్వర న్యాయం జరిగే లాగా కృషి చేయవలసిందిగా వ్యక్తిగతంగా కోరాను. నా హోదాను, ఉనికిని సునీల్‌కి తెలియజేయటం ఇష్టం లేదు. అవసరమైన ఆశల్ని రేకెత్తించటం అసలే మంచిది కాదనిపించింది. ఆ విధంగా నా వంతు మాట సహాయాన్ని అందజేశాన్న సంతృప్తితో, నిర్మలమైన (స్వచ్ఛ), ఆరోగ్యవంతమైన ఆలోచనలు కలిగి ఉన్న సగటు భారతీయుణ్ణి సునీల్‌లో ఊహించుకుంటూ ఉప్పొంగిపోవటం నావంతైంది.
- దాసరి శ్రీనివాసులు

No comments:

Post a Comment